గ్రీవెన్స్ లో ప్రజా సమస్యలకు భూమా అఖిలప్రియ భరోసా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 9 : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రజలు 150కు పైగా అర్జీలు సమర్పించారు. నివాస గృహాలు, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ పెంపు, రెవెన్యూ సంబంధిత సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వంటి ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున తన దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజలు అందజేసిన అర్జీలపై సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అర్జీకి తక్షణ పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ మండలంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలకు అవసరమైన అన్ని సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటామని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం కష్టపడుతుంటే వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటీవల లిఫ్ట్ ఇరిగేషన్ అంశం, అనంతరం రాజధాని అంశంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు మాత్రం కావాలని వ్యాఖ్యానించారు. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు కూడా రావని స్పష్టం చేశారు.
వైసీపీ నాయకులు అనవసర రాజకీయాలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజా సమయాన్ని వృథా చేసే డైవర్షన్ రాజకీయాలను తీసుకురావద్దని భూమా అఖిలప్రియ తెలిపారు.

Scroll to Top