

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 8 :
నంద్యాల జిల్లా మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న విజయ్ అనే విద్యార్థి పాఠశాల ఆవరణలో ఉన్న ఇనుప కడ్డీ తలకు గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
ఈ ఘటన పూర్తిగా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే చోటు చేసుకున్నదని, విద్యార్థుల భద్రత పట్ల కనీస బాధ్యత కూడా పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు మాత్రమే కాకుండా, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా వసతి గృహాన్ని తనిఖీ చేసిన సమయంలో, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించగా కుళ్ళిపోయిన టమోటాలు, క్యారెట్లు, ఉల్లిగడ్డలు కనిపించడం షాక్కు గురి చేసిందని తెలిపారు. ఇదేనా గిరిజన పిల్లలకు పెడుతున్న ఆహారం? అని అధికారులను ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకునే నేరమని మండిపడ్డారు.
విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ఎలాంటి అలసత్వం చూపినా, అది చిన్న అధికారి అయినా, పెద్ద అధికారి అయినా సరే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే, ఏపీ ఎస్టీ కమిషన్ నేరుగా జోక్యం చేసుకొని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని స్పష్టంగా ప్రకటించారు.
ఈ ఘటనపై తక్షణ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించామని తెలిపారు. అలాగే విద్యార్థులకు మెరుగైన భద్రతా ఏర్పాట్లు, నాణ్యమైన ఆహారం అందేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుల వెంట ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరి చంద్రప్ప , జిల్లా అధ్యక్షులు రామరాజు, సుగాలెక్కులు పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుండాల నాయక్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగసారి సుంకన్న , మాజీ జెడ్పిటిసి సభ్యురాలు నారాయణమ్మ గిరిజన నాయకులు వెంకటేష్, లోక్ నాయక్ , అంజి నాయక్, రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
