2026లో నంద్యాల జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పిలుపు

నంద్యాల జిల్లా / జనవరి 01- 2026 / సత్యం వార్త ప్రతినిధి :
ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్భంగా గురువారం నంద్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సర్వోన్నత అధికారి రాజకుమారి గణియా ని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తిరిగి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సరంలో జిల్లాలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను గుర్తు చేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

నూతన సంవత్సరం 2026లో నంద్యాల జిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలన, సమర్థవంతమైన సేవల అందింపు దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ పరిపాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సత్వర సేవలు అందించాలన్నారు. భూ సమస్యల పరిష్కారం, రీ-సర్వే ప్రక్రియ, భూ హక్కుల పరిరక్షణ, పెన్షన్లు, గృహ నిర్మాణం, ఉపాధి కల్పన వంటి అంశాలలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే గ్రామీణ అభివృద్ధి, పట్టణ సౌకర్యాల విస్తరణ, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్య రంగాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలని కోరారు.

“ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి పునాది” అని పేర్కొన్న జిల్లా కలెక్టర్, ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ప్రతి ఉద్యోగి ప్రజలతో సానుకూలంగా మెలిగి, సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించే దృక్పథం కలిగి ఉండాలని హితవు పలికారు. ఈ నూతన సంవత్సరంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే నంద్యాల జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిదేనని గుర్తు చేస్తూ, 2026 సంవత్సరం నంద్యాల జిల్లాకు సుభిక్షం, సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కలిగిన సంవత్సరంగా నిలవాలని ఆకాంక్షించారు.

Scroll to Top