



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 24 :
ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని, ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల మండలం, కానాల గ్రామంలో నేడు ‘స్వచ్ఛ రథం’ (చెత్త సేకరణ వాహనం) ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిలుగా విచ్చేసి, స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఈ స్వచ్ఛ రథాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని, ప్రజలు తమ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం, స్వచ్ఛమైన వాతావరణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పరిశుభ్రత పరిరక్షణలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఇళ్లలో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా వర్గీకరించి ఇవ్వాలని సూచించారు. అలాగే అట్ట పెట్టెలు, ప్లాస్టిక్ సీసాలు, ఇనుము తదితర పనికిరాని వస్తువులను స్వచ్ఛ రథం వచ్చినప్పుడు అప్పగిస్తే, వాటికి తూకం వేసి తగిన మేర నగదు లేదా గృహ వినియోగానికి ఉపయోగపడే వస్తువులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచడం, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ స్వచ్ఛ రథాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజలందరి సామూహిక బాధ్యత అని అన్నారు. గ్రామాల్లో చెత్త నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసి, స్వచ్ఛతను నిరంతరం కొనసాగించేందుకు స్వచ్ఛ రథాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సక్రమంగా సేకరించి శాస్త్రీయ విధానంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, పిట్టల అనీఫ్ , లాయర్ బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్వో, ఎంపీడీవో, మండల అధికారులు పాల్గొన్నారు.
