

శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజీలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
సత్యం వార్త / నంద్యాల / జనవరి 23 :
శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో వసంత పంచమి వేడుకలు శాస్త్రోక్తంగా మరియు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వసంత పంచమి విద్య, విజ్ఞానం, సృజనాత్మకతకు ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యలోనే కాకుండా జీవితంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులందరూ విద్యార్థి దశలో చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని దేశానికి సమాజానికి సేవ చేసే గొప్ప స్థానాలలో ఉంటూ దేశ సౌభాగ్యాన్ని పెంపొందించాలని అన్నారు. ప్రకృతికి అనుగుణంగా వచ్చే పండుగలలో వసంత పంచమి సరస్వతీ పూజ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుందని ఇవి మన భారత దేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక విలువలను విద్యార్థులను పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.ఎస్. ప్రగతి మాట్లాడుతూ, వసంత పంచమి మన భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని, విద్యార్థులు ఈ రోజు ప్రాముఖ్యతను అర్థం చేసుకుని విద్యపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులచే సరస్వతి దేవి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాలేజీ సిబ్బంది డాక్టర్ లలితా సరస్వతి, విజయకాంత్, మురళీధర్, మహేష్ గుప్తా, యు వి ఎస్ కుమార్, సంపత్ కుమార్, ఆండ్రూస్, శ్రీమతి హిమబిందు, మద్దిలేటి తదితరులు కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో ఆధ్యాత్మికతతో పాటు విద్యాపట్ల ఆసక్తిని పెంచాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థులందరికీ ప్రసాద వితరణ చేశారు.
