శ్రీశైలంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 12 :

శ్రీశైల మహా పుణ్య క్షేత్రంలో గురువారం సాయంత్రం వైభవంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.

ముందుగా మంత్రి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, వారి రాకపోకలు, దర్శన ఏర్పాట్లు సజావుగా ఉండేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని, భక్తులకు తాగునీరు, విద్యుత్, వైద్య, పారిశుధ్య, రవాణా సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేద పండితులు పాల్గొన్నారు. కార్యక్రమం భక్తి పారవశ్యంతో ముగిసింది.

Scroll to Top