


అన్నదానం మహాదానం భక్తులకు ఆహారం అందించడం ఎంతో పుణ్యం
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 16 :
మహాశివరాత్రి మహానంది బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఆహారం అందించడంలో అన్నదానం,మహాదానం అని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర క్షేత్రమైన మహానంది దేవస్థానం లో ఉన్న శ్రీ మహానందీశ్వర స్వామి , అమ్మవార్లను నంద్యాల మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం కమ్మ సంఘం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మహానందిలో ఏర్పాటు చేసిన కమ్మవారి అన్నదాన సత్రాన్ని సందర్శించారు. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు మహానందికి తరలివస్తారని, వారికి సౌకర్యవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో కమ్మ సంఘం వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అన్నదానం మహాదానం” అని, భక్తులకు ఆహారం అందించడం ఎంతో పుణ్యకార్యమని పేర్కొన్నారు. మహాశివరాత్రి వంటి పవిత్ర రోజున భక్తులతో కలిసి స్వయంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించడం తనకు ఆనందాన్నిచ్చిందని తెలిపారు. భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు సమాజంలోని ప్రతి వర్గం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు, కమ్మ సంఘం ప్రతినిధులు మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధల నడుమ జరిగిన ఈ కార్యక్రమం మహాశివరాత్రి ఉత్సవాలకు మరింత విశిష్టతను చేకూర్చింది.
