విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

కృషి, పట్టుదల, తపనతోనే విజయ శిఖరాలకు చేరుకోవచ్చు…

ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి…

నంద్యాల జిల్లా / జనవరి 03- 2026 / సత్యం వార్త ప్రతినిధి :

విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం  నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను స్వయంగా పరిశీలించి, పాఠ్యాంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి పాఠ్యాంశాలను చదివించి వారి అభ్యసన స్థాయిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమై, రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా నిలబెట్టాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన విధానంపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతకుముందు సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి రోజుల్లో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతున్న నేపథ్యంలో ముందుండాలంటే సరైన ప్రణాళికతో పట్టుదలగా చదవాలని సూచించారు. నేర్చుకోవాలనే తపనతో పాటు సానుకూల దృక్పథం కూడా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఏ అంశం అర్థం కాకపోతే ఉపాధ్యాయులను నిర్భయంగా ప్రశ్నించి తెలుసుకునే తత్వం అలవర్చుకోవాలని, తద్వారా పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించవచ్చని అన్నారు. సబ్జెక్టులను యాంత్రికంగా కాకుండా వాటి సారాంశాన్ని లోతుగా అవగాహన చేసుకొని పాఠ్యపుస్తకాలను పఠనం చేయడం ద్వారా ఉన్నత విద్యకు పునాది పడుతుందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అలాగే జిల్లాలోని 281 పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు అన్ని శాఖల అధికారులను నియమించి నిరంతర పర్యవేక్షణలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగానే తనకు కేటాయించిన ఏపీ మోడల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులతో అభ్యాసన పద్ధతులపై ముచ్చటించడం జరిగిందన్నారు.

అనంతరం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. అలాగే జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు లోకేష్, షారా లను మోమెంటో, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీఓ నిత్యానంద రాజు, పాఠశాల ప్రిన్సిపల్ పి.ఎన్. మల్లికార్జునప్పతో పాటు ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Scroll to Top