
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 18 :
విద్యార్థుల ప్రతిభా పాటవాలను వెలికితీసే ఉద్దేశంతో నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన నంది బాలోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ పోటీల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. రెండవ రోజు ఉపన్యాసం, తెలుగులో మాట్లాడటం, క్విజ్, సెల్ఫీ, మ్యాప్ పెయింటింగ్, మెమొరీ టెస్ట్, మట్టితో బొమ్మలు, దేశభక్తి గీతాలు, కోలాటం, జానపద నృత్యం, పద్య భావం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం రెండు రోజుల పాటు 21 రకాల పోటీలు నిర్వహించారు. చివరి రోజు సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు డీసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఓ. లలిత, డాక్టర్ యూ. లక్ష్మి సౌజన్య, ఎంఈఓలు శివరామకృష్ణ, ఈఎన్‌టి వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్, విద్యాసంస్థల ప్రతినిధులు షేక్షావలి రెడ్డి, భాస్కర్, మురళీధర్ రెడ్డి, వెంకటరాముడు, డాక్టర్ నాగరాజు తదితరులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సాధనతో ఏదైనా సాధ్యమేనని విద్యార్థులను ప్రోత్సహించారు. బాలోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అధికారులు శుభ్రతపై అవగాహన కల్పించారు. శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమంలో నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్ డి. మౌలాలి, నిర్వాహకులు జి. నాగేష్, రామరాజు, గోపాల్, పి.వి. ప్రసాద్, కిరణ్ కుమార్, శివ, ఖాజా మొహిద్దీన్, రమణ, బి. శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
