రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి

రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

వాహనాల్లో అధిక లోడింగ్‌కు తావులేదు

37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్

డ్రైవర్లు ప్రమాదం జరగక ముందే అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 31 :

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అన్నారు. వాహనాలలో అధిక లోడింగ్ చేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని, దీనిపై డ్రైవర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని విజయ పాల డైరీ సమీపంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఓ శివారెడ్డి, ఆర్ & బీ ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ హెడ్ మదన్ మోహన్, చాపిరేవుల టోల్ ప్లాజా అధికారులు, లారీ మరియు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాహనాల సంఖ్య పెరగడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని, అందువల్ల ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదని, మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు. ఫోన్ కాల్ వచ్చినప్పుడు వాహనాన్ని పక్కకు నిలిపి మాట్లాడాలని, డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ మాట్లాడడం పెద్ద తప్పిదమని హెచ్చరించారు. ఒక ప్రమాదాన్ని నివారిస్తే ఒక తరాన్ని కాపాడినట్లేనని, డ్రైవర్లు అత్యంత అప్రమత్తతతో వాహనాలు నడపాలని అన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, రోడ్డు ప్రమాదాల కారణంగా ఎవ్వరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రాకుండా రవాణా శాఖ అధికారులు జిల్లాలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలలో ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పోలీసు, రవాణా శాఖలు సమన్వయంతో పక్కా ప్రణాళిక రూపొందించి ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, కల్వర్టులు, అండర్ పాస్‌ల వద్ద రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాల వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతి ఒక్కరూ గుర్తించి, మన ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని స్పష్టం చేశారు. నూనెపల్లె బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటున్నందున అక్కడ బస్సుల నిలుపుదల కోసం ప్రత్యేక సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.  ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటంకన్నా, ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచించారు. ప్రాణం ఎంతో విలువైనదని, రోడ్డు ప్రమాదాల కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలందరూ అవగాహన పెంచుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, చాలావరకు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమవుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ సమయంలో డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వాహనాలు నడిపే డ్రైవర్లు పగలు సరిపడ విశ్రాంతి తీసుకొని, ఎదురుగా వస్తున్న వాహనాలను గమనిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలన్నారు. వాహనం నడపకముందు వాహన ఫిట్‌నెస్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తో పాటు అవసరమైన అన్ని పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. బ్యాటరీలలో మంటలు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను త్వరలోనే ఆన్‌లైన్ ద్వారా సులభంగా పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, డ్రైవర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని తెలిపారు. బస్సులు, టాక్సీలు, ఆటోలు తదితర వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ ఏడాది 2026లో జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రమాదాల్లో కాళ్లు, చేతులు విరిగి జీవితాంతం నరకప్రాయమైన జీవితం గడపాల్సి వచ్చే పరిస్థితులు ఉంటాయని, ప్రతి డ్రైవర్ తన కుటుంబం – భార్య, పిల్లలు, తల్లిదండ్రులను గుర్తు చేసుకొని జాగ్రత్తగా వాహనం నడపాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన వ్యక్తిగత అనుభవాన్ని సంక్షిప్తంగా ప్రస్తావిస్తూ, రోడ్డు ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోయిన బాధ తనకు ఇప్పటికీ వెంటాడుతుందని తెలిపారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు శాశ్వతంగా నష్టపోతాయని, అటువంటి విషాదాలు మరెవరికీ ఎదురుకాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ హెచ్చరికలు చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతతో వ్యవహరించి అమాయకుల ప్రాణాలను కాపాడాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా లారీ మరియు ఆటో డ్రైవర్ల కోసం కర్నూలు మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

Scroll to Top