నంద్యాల మార్కెట్ యార్డ్ జనరల్ బాడీ సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 06 :
నంద్యాల మార్కెట్ యార్డ్ అభివృద్ధి మరియు రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు . సోమవారం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మార్కెట్ యార్డులను మళ్లీ పూర్వవైభవానికి తీసుకువస్తామని, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో యార్డ్ కమిటీలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. యార్డులో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, దళారీల ప్రమేయం లేకుండా చూడాలని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ మంత్రి ఫరూక్ సహకారంతో నంద్యాల యార్డును రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు.
ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ పాలకమండలి సభ్యులు, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
