రైతుల భూములతో పార్టీ ఆఫీసులా? టీడీపీపై వైసీపీ ఫైర్  –  మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష

–              అధికార దాహానికి అడ్డూఅదుపు లేదా? టీడీపీ భూదాహంపై వైసీపీ ఫైర్

–              రైతుల నోళ్లు కొట్టి పార్టీ ఆఫీసులు కడతారా? – వైసీపీ నిలదీత

–              భగ్గుమన్న నంద్యాల వైసీపీ: మార్కెట్ యార్డ్ భూముల్లో టీడీపీ ఆఫీసా? మండిపడుతున్న నేతలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 03  :

నంద్యాలలో రాజకీయ సెగ రాజుకుంది. రైతుల సంక్షేమం కోసం కేటాయించిన మార్కెట్ యార్డ్ భూములను టీడీపీ కార్యాలయానికి ధారాదత్తం చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూదాహానికి తెరలేపిందని వారు విమర్శిస్తున్నారు. నంద్యాల నూనెపల్లెలోని వ్యవసాయ మార్కెట్ యార్డు భూముల కేటాయింపు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. కోట్లాది రూపాయల విలువైన 2 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించడంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష  టి‌డి‌పి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ఈ‌ సంధర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష మాట్లాడుతూ.. రైతుల కోసం ఉన్న మార్కెట్ యార్డ్ భూమిని టి‌డి‌పి పార్టీ కార్యాలయానికి ఇవ్వడం దారుణమన్నారు. ఎకరాకు కేవలం ఏడాదికి 1,000 రూపాయలకే లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని 33 ఏళ్ల పాటు అప్పనంగా అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. “నంద్యాలలో టీడీపీ నేతల భూదాహం ఏ స్థాయికి చేరిందంటే.. రైతులకు దక్కాల్సిన మార్కెట్ యార్డ్ స్థలాన్ని కూడా వదలడం లేదు. నూనెపల్లె మార్కెట్ యార్డ్ పరిధిలోని 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ ఆఫీసు కోసం కేటాయించడం రైతులను వంచించడమే అన్నారు. ఎకరాకు వెయ్యి రూపాయల లీజు అంటే అది ప్రభుత్వ ఆస్తిని దోచిపెట్టడం కాదా అని సూటిగా ప్రశ్నించారు? దీనిపై మేము న్యాయపోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంపై రైతులు కూడా ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి జీవోలు జారీ చేయడంపై వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. కూటమి సర్కార్‌పై శిల్పా ఫైర్ అయ్యారు.  నంద్యాల అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శ చేశారు. శిల్పా కుటుంబంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి తీవ్రంగా ఖండించారు. సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం వల్ల నష్టపోయేది పేదలేనని ఆయన హెచ్చరించారు. రెండేళ్లు గడిచినా నంద్యాల అభివృద్ధి శూన్యమని, కేవలం సాకులు చెపుతూ కాలం గడుపుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారంలో తమపై వస్తున్న విమర్శలను శిల్పా రవి రెడ్డి తిప్పికొట్టారు. శిథిలావస్థలో ఉన్న కాంప్లెక్స్ లను నిబంధనల మేరకే లీజుకు తీసుకున్నామని, వాటిని తామే మరమతులు చేసుకున్నామని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి శిల్పా సహకార్ బ్యాంక్, మినరల్ వాటర్ ప్లాంట్లు, రైతు సమాఖ్య వంటి సేవా కార్యక్రమాలను ఆపాలని హుకుం జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాలు నిలిపివేస్తే శిల్పా కుటుంబానికి వచ్చే నష్టం ఏమీ లేదని.. నష్టపోయేది పేద ప్రజలే అని గుర్తుంచుకోవాలన్నారు. నంద్యాల జిల్లాగా మారిన తర్వాత కొత్తగా ఒక్క భవనాన్ని కూడా నిర్మించలేదని శిల్పా విమర్శించారు. నేటికీ కలెక్టరేట్ ఆర్ఏఆర్ఎస్  భవనాల్లోనే కొనసాగుతోందని, వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలే నేటికీ దిక్కని గుర్తు చేశారు. నందమూరి నగర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయలేదని, ఉర్దూ కళాశాల, టీటీడీ కళ్యాణ మండపం భవనాలు ప్రారంభానికి నోచుకోలేదని విమర్శించారు. బొగ్గులైన్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయడం అన్యాయమన్నారు. ఇక అమరావతి నిర్మాణంపై జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకం కాదని, కేవలం నిర్మాణ ఖర్చుపైనే తమ ప్రశ్న అని స్పష్టం చేశారు. చదరపు అడుగుకు 12 వేల రూపాయల వ్యయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే.. వైసీపీ పథకాలకు పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

Scroll to Top