

జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల నుండి మొత్తం 373 దరఖాస్తులను స్వీకరించామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్స్‌కు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు సమర్పించారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ డిఆర్ఓ రాము నాయక్, రెవిన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అన్నీ మండలాల తాసిల్దారులు రెవిన్యూ క్లినిక్స్లలో ఉత్సాహంగా పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత రెవెన్యూ డెస్క్‌లలో నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం మరింత పెంచి, సంతృప్తి స్థాయిని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు నేరుగా సేవలు అందించడం వల్ల సమస్యల పరిష్కారం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా స్వీకరించిన 373 దరఖాస్తులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…రెవిన్యూ, గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించిన అర్జీలు – 9, అడంగల్ సవరణలకు సంబంధించిన అర్జీలు – 106, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూముల సంబంధించిన అర్జీలు – 65, అసైన్డ్ భూములు, భూఆక్రమణలకు సంబంధించిన అర్జీలు – 65, రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్‌ఓఆర్‌కు సంబంధించిన అర్జీలు – 33, సర్వే, రీ-సర్వేకు సంబంధించిన అర్జీలు – 63, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించిన అర్జీలు -32 స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. స్వీకరించిన సమస్యలను త్వరితగరిత్తిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రెవెన్యూ క్లినిక్స్‌ను నిర్వహించి ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.


