ముచ్చుమర్రి / మల్యాల నుండి కేసీ కెనాల్‌కు నీటి విడుదల

మొదటి 20 రోజులు నిరంతరాయంగా నీరు

చివరి ఆయకట్టువరకు నీటి సరఫరా

నీటిని పొదుపుగా వినియోగించాలి – రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి

  • జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 24 :  

కేసీ కెనాల్‌ పరిధిలో రబీ పంట వేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో మొదటి 20 రోజులపాటు చివరి ఆయకట్టువరకు నిరంతరాయంగా నీటిని విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ముచ్చుమర్రి / మల్యాల పంప్ హౌస్ ద్వారా నీటి పంపిణీ అంశంపై నందికొట్కూరు , పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో, అక్కడ ఉన్న 33 గేట్లకు మరమ్మత్తులు చేపట్టి భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కేసీ కెనాల్‌లో 0 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు నీటి ప్రవాహం తగ్గడంతో, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, కంది, మినుము వంటి ఆరుతడి పంటలు, కొంత మేర వరి పంట సాగు చేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేసీ కెనాల్‌లో నీరు లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఇతర ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వినియోగించి, అవసరమైన మేరకు నీటిని నిల్వ చేస్తూ రైతులకు విడుదల చేస్తోందన్నారు. ఈ విషయాన్ని నందికొట్కూరు, పాణ్యం, శ్రీశైలం శాసనసభ్యులు… ఇన్‌చార్జ్ మంత్రి, జలవనరుల మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.

దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి మల్యాల–ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇచ్చారని, దీని ద్వారా ఒక్క ఎకరా కూడా పంట నష్టం జరగకుండా రైతులకు నీటిని అందిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతులు నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాలువ చివర ప్రాంతమైన గడివేముల మండల రైతులకు కూడా సమానంగా నీరు అందాలంటే, పై ఆయకట్టు రైతులు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలని సూచించారు. నీటి వృథా జరిగితే చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. నీటి నియంత్రణ కోసం రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖలతో పాటు ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ క్రమబద్ధమైన వ్యవస్థను అమలు చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులకు నీటిని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున  ముఖ్యమంత్రి, జలవనరుల మంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి గార్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్‌కు సంబంధించిన 33 గేట్లను 70 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ ఏడాదే మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో, ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. గత ఐఏబి (IAB) సమావేశంలో 0 నుంచి 150 కి.మీ వరకు కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వలేమని నిర్ణయించినప్పటికీ, గతంలో తుఫానుల కారణంగా రైతులు వేసిన పంటలు నష్టపోవడం, గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాల వల్ల నీటి లభ్యత ఉండటంతో రైతులు మళ్లీ పంటలు విత్తుకున్నారని, ఈ దశలో సరైన నీరు లేకపోవడంతో రైతుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇరిగేషన్ మంత్రి, ఇన్చార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్‌లకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ముఖ్యంగా నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల పరిధిలో 0 నుంచి 150 కి.మీ వరకు, గడివేముల మండలం చివరి ప్రాంతాల వరకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో, నిలకడగా ఉన్న పంటలకు మల్యాల, ముచ్చుమర్రి ప్రాంతాల నుంచి పైపుల ద్వారా (లిఫ్ట్ ఇరిగేషన్) నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోందని అన్నారు.

నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య మాట్లాడుతూ, తుంగభద్ర డ్యామ్ గేట్ల మరమ్మతుల కారణంగా కేసీ కెనాల్‌లో నీటి సరఫరా నిలిచిపోవడంతో నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల్లో 0 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుమారు 50 వేల ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. రైతుల సమస్యలను గుర్తించిన స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముచ్చుమర్రి, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం కాలువ చివరి భాగంలో ఉండటంతో ప్రతి రైతుకూ నీరు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పైభాగ రైతులు అవసరానికి మించి నీరు వాడకుండా సహకరించాలని సూచించారు. నీటి పంపిణీ సక్రమంగా జరిగేలా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. పంటలను కాపాడేందుకు సకాలంలో నీటిని విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top