ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసి కెనాల్ కు సాగునీరు విడుదల – నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 24 : 

నంద్యాల జిల్లా, నందికొట్కూరు  నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నాలుగు గేట్ల ద్వారా 1000 క్యూసెక్కులు, మల్యాల పంపు హౌస్ రెండు మోటార్ల ద్వారా 600 క్యూసెక్కులు, మొత్తం 1600 క్యూసెక్కుల నీరు కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రత్యేక చొరవతో శనివారం సాగునీరు విడుదల చేయడం జరిగిందనీ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత డిసెంబర్ 2వ తేదీ నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వివిధ ప్రాజెక్టుల నిర్వహణ పరిస్థితి, ఈ రబీ సాగుకు అవసరమైన నీటి లభ్యతపై సమగ్రంగా చర్చించి,  ఈ  జనవరి 15 తరువాత కే.సి. కెనాల్‌కు నీరు అందుబాటులో ఉండదని స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

తుంగభద్ర డ్యాంలో గేట్లకు చేపట్టిన అత్యవసర మరమ్మత్తుల కారణంగా డ్యాం నుండి నీటి విడుదల పరిమితమై, అందుబాటులో ఉన్న నీటి పరిమాణం గణనీయంగా తగ్గిపోయిందనీ,  ఈ సాంకేతిక పరిస్థితుల నేపథ్యంలోనే నీటి సరఫరా విషయంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ లో కే.సి. కెనాల్ పరిధిలోని మొత్తం ఆయకట్టు ఒక పంటకు పూర్తి సాగు నీరు అందించడం జరిగిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. రబీ పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, అవాస్థవ ప్రచారం రైతులు నమ్మవద్దని ఎంపీ బైరెడ్డి శబరి విజ్ఞప్తి చేశారు.

Scroll to Top