





సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 16 :
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన “అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన (బండలాగుడు పోటీలు)” అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పవిత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో, శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వర స్వామి వారి సన్నిధిలో, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ‘అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన’ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఒంగోలు జాతి ఎద్దులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని. మన రైతు సోదరులు తమ బిడ్డలకంటే మిన్నగా పెంచుకున్న ఈ పశుసంపదను ప్రదర్శించడం, మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటమే అని అన్నారు. రైతు రాజ్యమైన మన రాష్ట్రంలో వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక మరియు క్రీడా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని. ఈ బండలాగుడు పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, మన రైతుల్లో ఉన్న పట్టుదలను, పౌరుషాన్ని చాటిచెప్పడానికి ఒక వేదిక అని. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి రైతు సోదరుడికి, వారి ఎద్దులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, మహానంది ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని , కొట్టాల శివనాగిరెడ్డి, ప్రేమ్ నాథ్ రెడ్డి, రాజేష్, సురేష్, గోస్పాడు మండల కన్వీనర్ తులసిశ్వర్ రెడ్డి, నంద్యాల మండలం టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, షేక్ మొహమ్మద్ రఫీ (మున్నా), నాగేశ్వరరావు, అడ్వకేట్ ఖలీల్, మరియు భారీ సంఖ్యలో రైతులు, భక్తులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
