బాలల వైద్యంలో ఆధునిక విధానాల పై వైద్య సదస్సు

నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్

సదస్సులో ప్రసంగించిన  మహిళా వైద్యులు న్యూరో సర్జన్ డాక్టర్ విశాఖ, న్యూరాలజిస్ట్ డాక్టర్ రమ్య, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లీనాధ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ అనుపమ మరియు నంద్యాల చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ నయన్ బాబా

     భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, హైదరాబాద్ రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులతో  “బాలల వైద్యంలో ఆధునిక విధానాలు”   పేరిట నిరంతర వైద్య విద్యా సదస్సు మధుమణి ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించారు.

     నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ వివిధ స్పెషాలిటీ వైద్య విభాగాలలో వస్తున్న ఆధునిక మార్పులపై వైద్యులు నిరంతరం వారి పరిజ్ఞానాన్ని పెంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. సదస్సులో ప్రసంగిస్తున్న హైదరాబాద్ రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్  సూపర్ స్పెషాలిటీ వైద్యులు నలుగురు కూడా మహిళలు కావడం విశేషమని, వైద్య రంగంలో పెరుగుతున్న మహిళల పాత్రకు ఇది నిదర్శనం అన్నారు.

   ఈ సదస్సులో “బాలలలో న్యూరో సర్జరీ చికిత్సలు ” అంశంపై న్యూరో సర్జన్ డాక్టర్ విశాఖ బసవరాజ్, “బాలలలో నాళ  రహిత గ్రంథులలో వచ్చే జబ్బులపై” ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ జక్కిడి లీనాధ మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా ప్రసంగించారు.

తదుపరి “బాలలలో న్యూరాలజీ అత్యవసర చికిత్సలపై” క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎర్రా అనుపమ సమన్వయకర్తగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ బండి రమ్య, నంద్యాల చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నయన్ బాబా పాల్గొని చిన్న పిల్లలలో నరాలు, మెదడుకు సంబంధించిన జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి సరైన చికిత్స అందించడం గురించి వివరించారు.

    ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల పూర్వ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,డాక్టర్ సహదేవుడు,రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, నంద్యాల ఐఎంఏ  కోశాధికారి డాక్టర్ హరిత, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, అధిక సంఖ్యలో నంద్యాల ప్రాంత వైద్యులు పాల్గొన్నారు.

Scroll to Top