ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలి

అత్యవసర ఎగ్జిట్లు, మాక్ డ్రిల్స్ తప్పనిసరి

  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 18 :

జిల్లాలోని ఫ్యాక్టరీలు, కర్మాగారాలలో సంభవించే అగ్ని ప్రమాదాలు మరియు ఇతర పారిశ్రామిక విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి యూనిట్‌లో అత్యవసర సిద్ధత తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విపత్తుల నిర్వహణ సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, కర్మాగారాలలో క్రమం తప్పకుండా అత్యవసర మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు. కార్మికులకు ఫస్ట్ ఎయిడ్ శిక్షణ అందించడంతో పాటు, ప్రమాద సూచికల బోర్డులు స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి యూనిట్‌లో భద్రతా ప్రమాణాలను పరిశీలించే బాధ్యత గల సిబ్బందిని నియమించి, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలైన ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో ప్రతి కార్మికునికి స్పష్టంగా తెలిసేలా ఉండాలన్నారు. ఎగ్జిట్ గేట్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని, తాళాలు వేసి ఉంచడం వల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి యూనిట్‌లో కనీసం రెండు కంటే ఎక్కువ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాద సమయంలో కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఎవాక్యుయేషన్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని, తాళాలు ఎవరి వద్ద ఉండాలి, ఎవరెవరు బాధ్యత వహించాలి అనే అంశాలపై స్పష్టత ఉండాలని కలెక్టర్ సూచించారు. దుగ్గిరాలలోని టర్మరిక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తేవడానికి సుమారు 25 రోజులు పట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే, పరిశ్రమల్లో అమ్మోనియా లీకేజీ వంటి ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు సాంకేతిక నిపుణులు అందుబాటులో లేక ఆలస్యం జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు అత్యవసర సమయాల్లో నిపుణులు వెంటనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పని చేసే కార్మికులకు తగిన రక్షణ పరికరాలు తప్పనిసరిగా ఇవ్వాలని, ప్రమాద పరిస్థితులను ఎదుర్కొనే శిక్షణ కల్పించాలని తెలిపారు. అమ్మోనియా లేదా క్లోరిన్ వంటి వాయువులు లీక్ అయితే అవి ఎంత మేర వ్యాపిస్తాయి, ఎంతమందిని ఖాళీ చేయించాలి అనే వివరాలతో జిల్లా స్థాయిలో ముందస్తు ప్రణాళిక సిద్ధంగా ఉండాలని సూచించారు.

డోన్ మండలం ఉడుములపాడు గ్రామ సమీపంలోని అగ్రి సోల్ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాల మండలం ఉడుమాల్‌పురం ప్రాంతంలోని ఎస్పీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమల నుంచి వచ్చే దుర్వాసన కారణంగా అక్కడ నివాసాలు నిర్మించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేసి, కార్మికుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి పరిశ్రమల్లో సంభవించే ప్రమాదాల రకాలు, వాటి నివారణ చర్యలు, ప్రమాదం సంభవించినప్పుడు వివిధ శాఖలు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు మరియు విధి విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు.

Scroll to Top