ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – మంత్రి ఎన్ఎండి ఫరూక్, గౌరు చరిత రెడ్డి

  • చివరి ఆయికట్టు వరకు సాగునీటిని అందిస్తున్నాం
  • రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
  • ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడడం తగదు
  • వైకాపా నేతలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి ఫైర్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 7 :  రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, కమిషన్ల కోసం ప్రాజెక్టుల నిర్మాణాలను గాలికొదిలేసిన వారికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.  బుధవారం నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర రెడ్డి, గీతా జయసూర్యలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాలపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదని వారు మండిపడ్డారు. వెలుగోడు ప్రాజెక్టు ద్వారా ప్రతి అడుగును తడిపి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అలగనూరు కరకట్ట మట్టిని సైతం వైకాపా హయాంలో అమ్ముకున్నారని ఆరోపించారు. కరకట్ట ప్రమాదంలో ఉన్నా పట్టించుకోకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని, కూటమి ప్రభుత్వం వచ్చాక తక్షణ మరమ్మతులకు కోటి రూపాయలు, శాశ్వత పనుల కోసం ఇటీవల మరో రూ. 58 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే ప్రాజెక్టుల కోసం రూ. 6600 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రాజెక్టులపై అవగాహన లేని వైకాపా నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

ప్రాజెక్టుల అభివృద్ధి పై వైకాపా నేతలు చర్చకు సిద్ధమా అని బుడ్డా రాజశేఖర రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కుప్పం వరకు సాగునీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నీటి సంఘాల చైర్మన్ రామలింగారెడ్డి, డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ చాబోలు ఇలియాస్ పాల్గొన్నారు.

Scroll to Top