

వార్డెన్లు వసతి గృహ విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 28 :
వసతి గృహాలలో నివసిస్తున్న విద్యార్థులను వార్డెన్లు, సిబ్బంది తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా సూచించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న ప్రభుత్వ మైనార్టీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని వసతులు, పరిశుభ్రత, భోజన నాణ్యత, విద్యార్థుల సంక్షేమంపై సమగ్రంగా పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ఆ నిధులు సద్వినియోగం కావాలంటే మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. వసతి గృహ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ పరిశుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. టాయిలెట్లు, బాత్రూంలను ప్రతిరోజూ శుభ్రపరిచి పారిశుధ్య లోపాలు లేకుండా చూడాలని తెలిపారు. వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థుల సంఖ్య, వారి విద్యాభ్యాసం, వసతులపై హాస్టల్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్, వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా చదువులో ప్రతిభ కనబరచాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి పాఠశాలకు హాజరుకావాలని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో వసతి గృహ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా శ్రమించి, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
