ప్రతి అర్జీకి స్పష్టమైన పరిష్కారం చూపాలి..రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 255 అర్జీలు, పిజిఆర్ఎస్ లో 139 దరఖాస్తుల స్వీకరణ  –  జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి /జనవరి 5 :

ప్రజల సమస్యలను సీరియస్‌గా పరిగణించి ప్రతి అర్జీకి ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, ఇతర అధికారులు జిల్లా నలుమూలల నుంచి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అదేవిధంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించి 255 దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పీజీఆర్ఎస్ వేదిక ద్వారా అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి స్పష్టమైన నిర్ణయాలతో పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున, అధికారులు మరింత బాధ్యతతో, చొరవతో మరియు వేగవంతంగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. రీ-ఓపెన్ అయిన దరఖాస్తులు, ఎస్‌ఎల్‌ఏ గడువు మించిన అర్జీలు, వీఐపీ గ్రీవెన్స్‌లను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఆడిట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత కాలపరిమితిలోగా వాటిని క్లియర్ చేయాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సమగ్ర కుటుంబ సర్వేను జనవరి నెలాఖరు నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సర్వేకు సంబంధించి సచివాలయ సిబ్బంది నిర్ణీత గడువులో పనులు పూర్తిచేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కొత్తపల్లి మండలంలో 31, పగిడ్యాల మండలంలో 43, ఆత్మకూరు (అర్బన్)లో 46, ఆత్మకూరు (రూరల్)లో 47, చాగలమర్రి మండలంలో 68, కోవెలకుంట్ల మండలంలో 78, కొలిమిగుండ్ల మండలంలో 15, బేతంచెర్ల మండలంలో కేవలం ఒక సర్వే మాత్రమే పూర్తయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక్కో సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ కనీసం 30 కుటుంబాల సర్వే పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించి, ఆర్డీఓలు, డిఎల్డీఓలు, స్పెషల్ ఆఫీసర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రజా సమస్యలు

●నంద్యాల పట్టణానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ నారాయణరెడ్డి రుద్రవరం మండలం కొత్తూరు నుంచి గుండెంపాడు వరకు రహదారి సంబంధిత సమస్యపై జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత వివరాలు పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా వెంటనే తహశీల్దార్‌ను ఆదేశించారు.

 ●ఆత్మకూరు మండలానికి చెందిన రత్నమ్మ తన యావదాస్తిని కుమారులు స్వాధీనం చేసుకొని తన బాగోగులు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత కుమారులదేనని వారికి అవగాహన కల్పించి, ఆమె బాగోగులు చూసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆత్మకూరు ఆర్డీఓను ఆదేశించారు.

●దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన మంగళి నాగేశ్వరరావు తాను వైకల్యంతో బాధపడుతున్నందున వైకల్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు.

పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన 139 అర్జీదారుల సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Scroll to Top