

పీజీఆర్ఎస్కు 100 దరఖాస్తులు – రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 34 అర్జీలు స్వీకరణ
జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 16 :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై మొత్తం 100 దరఖాస్తులు స్వీకరించబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమా మహేశ్వరి తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రజల అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా డీఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ, ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖలకు సరైన విధంగా కేటాయించాలని సూచించారు. నిర్ణీత సేవా ప్రమాణాల గడువు (ఎస్ఎల్ఏ) దాటి పోకుండా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పరిష్కరించిన అర్జీలపై అర్జీదారుల సంతృప్తి స్థాయిని కూడా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే రీఓపెన్ అయ్యే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలన్నారు.
రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 34 అర్జీల స్వీకరణ
భూసంబంధిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసినట్లు డీఆర్ఓ తెలిపారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగవంతంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 34 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో అడంగల్ సవరణలకు సంబంధించినవి -8, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూములకు సంబంధించినవి – -3, అసైన్డ్ భూములు, భూఆక్రమణలకు సంబంధించినవి – 4, రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్ఓఆర్కు సంబంధించినవి – 17, సర్వే, రీ-సర్వేకు సంబంధించినవి – 2 అన్ని దరఖాస్తులను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరిస్తామని డిఆర్ఓ స్పష్టం చేశారు.
