

ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి అర్జీకి ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రెవిన్యూ అర్జీదారుల మినహా 151 మంది దరఖాస్తుదారుల నుండి నుంచి జిల్లా కలెక్టర్ నేరుగా అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి స్పష్టమైన, ఖచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు సూచించారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, అధికారులు మరింత చొరవతో ప్రతి దరఖాస్తును నాణ్యతతో పాటు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కార ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలను సందర్శించి పర్యవేక్షించనున్న దృష్ట్యా, అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. రీ-ఓపెన్ అయిన దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న అర్జీలు, వీఐపీ గ్రీవెన్స్‌లను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఆడిట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత కాలపరిమితిలోగా వాటిని క్లియర్ చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని సమస్యలు
●ఆళ్లగడ్డ మండలం, మెట్టపల్లె గ్రామానికి చెందిన కె. లక్ష్మి నరసయ్య (వయస్సు 62 సంవత్సరాలు) తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు కాలేదని పేర్కొంటూ, అర్హతను పరిగణనలోకి తీసుకొని పెన్షన్ మంజూరుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.
●నంద్యాల మండలం, మూలసాగరం ప్రాంతానికి చెందిన ఆర్. లక్ష్మిరెడ్డి తనకు సర్వే నెం. 10, 11లలో కలిపి 5 ఎకరాల భూమి ఉన్నదని, అయితే పొరుగు భూముల యజమానులు తన పొలానికి వెళ్లేందుకు రస్తా ఇవ్వడం లేదని పేర్కొంటూ, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు అర్జీ అందజేశారు.
●దొర్నిపాడు మండలం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఎం. రాముడు వైకల్యంతో బాధపడుతున్నారని పేర్కొంటూ, తనకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు.
●ఆళ్లగడ్డ మండలం, మిట్టపల్లి గ్రామానికి చెందిన ఎం. ఓబులమ్మ తన భర్త అనారోగ్య కారణంగా మృతి చెందినట్లు తెలియజేస్తూ, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు.

