ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు… వెంటనే చర్య

బాధితులకు 12 తులాల బంగారాన్ని అప్పగించిన వన్ టౌన్ పోలీసులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 24 :

నంద్యాల పట్టణంలో చాబోలుకు చెందిన ఒక కుటుంబం పోగొట్టుకున్న 12 తులాల బంగారాన్ని వన్ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.

చాబోలు గ్రామానికి చెందిన షేక్ శాలినా తన భర్త, పిల్లలతో కలిసి ఉదయం బైక్‌పై నంద్యాల వన్ టౌన్ పరిధిలోని నడిగడ్డలో ఉన్న తన చెల్లెలి ఇంటికి బయలుదేరారు. తమ వెంట ఒక బ్యాగులో బట్టలు మరియు 12 తులాల బంగారాన్ని ఉంచుకున్నారు. అయితే, ప్రయాణంలో వన్ టౌన్ పరిధిలోకి రాగానే వారు గమనించకుండానే ఆ బంగారు నగలున్న బ్యాగ్ కింద పడిపోయింది. బంగారం పోయిందని గుర్తించిన బాధితులు హుటాహుటిన నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న ‘ప్రజా దర్బార్’ కు చేరుకుని, రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ని కలిసి ఫిర్యాదు చేశారు . బాధితుల పరిస్థితిని చూసి చలించిన మంత్రి తక్షణమే స్పందించి వెంటనే వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి కి ఫోన్ చేసి, ఘటనపై పూర్తి వివరాలు అందించి, గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధితులు కూడా పోలీసులను సంప్రదిస్తారని సమాచారం అందించారు.

మంత్రి ఫరూక్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐ సుధాకర్ రెడ్డి మరియు వారి సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం మరియు క్షేత్రస్థాయి విచారణ ద్వారా అతి తక్కువ సమయంలోనే పోగొట్టుకున్న బంగారాన్ని కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారాన్ని సీఐ బాధితులకు అప్పగించారు.

పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితులు ఆనందంతో మంత్రి ఫరూక్ కి మరియు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సమర్థవంతంగా పనిచేసి నగలను స్వాధీనం చేసుకున్న నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి ని, వారి సిబ్బందిని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేకంగా అభినందించారు.

Scroll to Top