

పిజిఆర్ఎస్ కు 278 దరఖాస్తులు
జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 09 :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమా మహేశ్వరి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ మాట్లాడుతూ….ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. అర్జీదారుడు ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీని క్షుణ్ణంగా చదివి సంబంధిత శాఖ అధికారులుకు కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పరిష్కరించిన అర్జీల పట్ల అర్జీదారుడి సంతృప్తి స్థాయిని కూడా తెలుసుకోవడం జరుగుతోందన్నారు. అదే విధంగా రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించడం జరుగుతోందన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని సమస్యలు:
ఆళ్లగడ్డ మండలం, పి.చింతకుంట గ్రామానికి చెందిన బి.సాలమ్మ తన భర్త చనిపోయాడని ఆర్థిక చేయూత కోసం తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ డిఆర్ఓకు అర్జీ సమర్పించారు.
బేతంచెర్ల మండలానికి చెందిన వై.లక్ష్మి తనకు బేతంచెర్ల నగర పంచాయతీలోని టిడ్కో గృహాల్లో జి-52 ప్లాట్ ను కేటాయించడం జరిగిందని, కానీ సదరు ప్లాట్ ఎక్కడ ఉందో ఇంత వరకూ చూపలేదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిఆర్ఓకు దరఖాస్తు అందజేశారు.
బండి ఆత్మకూరు మండలం, ఎర్నపాడు గ్రామానికి చెందిన సి. రాఘవేంద్ర రెడ్డి తనకు ఇంతవరకు మినీ గోకులంకు సంబంధించిన నగదు జమ కాలేదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిఆర్ఓకు అర్జీ సమర్పించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో 278 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా రెవెన్యూ అధికారికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వెట్టి చాకిరి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
వెట్టి చాకిరి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వెట్టి చాకిరి చట్టం 1976 రద్దు చేసి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అందుకు సంబంధించిన కరపత్రాల పోస్టర్లను డిఆర్ఓ ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమామహేశ్వరి, జిల్లా కన్వీనర్ కరీముల్లా, కో కన్వీనర్లు ఫిలిక్స్, అక్బర్ భాష, న్యాయ సలహాదారులు సయ్యద్ అమీర్ భాష తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ మాట్లాడుతూ వెట్టి చాకిరి అనేది ఒక రకమైన బలవంతపు శ్రమ అని, దీనిలో ప్రజలు అప్పు తీర్చడానికి పని చేయవలసి వస్తుందన్నారు. ఇవి ప్రజలను దోపిడీ, పేదరికం మరియు నియంత్రణ అనే వలయాలలో చిక్కుకునేలా చేయడం జరుగుతోందన్నారు. వెట్టి చాకిరి, వ్యక్తుల స్వేచ్ఛను మరియు గౌరవాన్ని హరిస్తుందన్నారు. వెట్టి చాకిరిని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి 1976లోనే దేశవ్యాప్తంగా వెట్టి చాకిరిని వ్యవస్థ నిర్మూలన చట్టం రద్దు చేసిందన్నారు. అప్పు తీర్చడానికి ఎవరినీ బలవంతంగా పని చేయమని ఒత్తిడి చేయించకూడదన్నారు. వెట్టి చాకిరి నేరాలు శిక్షార్హమైనవి, పోలీసు వారు ముందస్తు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా వెట్టి చాకిరిలో చిక్కుకుని ఉన్నారని మీరు అనుమానిస్తే, వెంటనే బాధ్యతాయుతంగా రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల రెవెన్యూ అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ లేదా కార్మిక శాఖ అధికారికి నివేదించాలన్నారు. అదే విధంగా ఇటువంటి పరిస్థితిని మార్చి అవగాహన పెంచి, ఇటువంటి నేరాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. అందుకు వెట్టి చాకిరి కార్మికులను గుర్తించి తగిన చర్యలు తీసుకొని వారికి పునరావాసం కల్పించి, ప్రతీ వెట్టి చాకిరి కార్మికుడిని రక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
