ప్రకృతి వ్యవసాయ విధానాలతో ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించాలి

రైతులకు నీటి నిర్వహణ, పోషక లోపాలపై అవగాహన అత్యవసరం

ఉద్యాన పంటల పెంపుతో జిల్లాకు ఆర్థిక వృద్ధి సాధ్యం

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 02  :

జిల్లాలో ఉద్యాన పంటలను విస్తృతంగా పెంపొందించడం ద్వారా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ను పెంచే అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఉన్న బి9 గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ – కన్వర్జెన్స్ విభాగాల సమన్వయ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాబోయే మే, జూన్ నెలల్లో మరింత పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో భూమి సారాన్ని కాపాడుకోవడం, లాభదాయకమైన పంటల ఎంపిక వంటి అంశాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించడం అవసరమన్నారు…

ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్  ప్రాముఖ్యం:  పీఎండీఎస్ విధానం ద్వారా భూమిని ఏడాది పొడవునా పంటలతో కప్పి ఉంచవచ్చని, ఇది ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. రైతులు ఈ విధానాన్ని విస్తృతంగా అనుసరించి, అందుబాటులో ఉన్న పీఎండీఎస్ కిట్లను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు….

ప్రకృతి వ్యవసాయం – అదనపు ఆదాయానికి మార్గం:  పొలాల గట్లను వెడల్పుగా తయారు చేసి వాటిపై కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఖర్చులు తగ్గడంతో పాటు, పంటల నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు….

భూసార పరీక్షలు, ఎరువుల వినియోగంపై దృష్టి :  జిల్లాలో నైట్రోజన్ లోపం ఉండగా, ఫాస్పరస్ అధికంగా ఉండటం, జింక్, సల్ఫర్ తక్కువగా ఉండటం గమనార్హమని తెలిపారు. అందువల్ల రైతులు భూసార పరీక్షలు చేయించుకొని అవసరమైన పోషకాలను గుర్తించి, యూరియా, డీఏపీపై ఆధారపడకుండా కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాలని సూచించారు…

నీటి వినియోగంలో సమర్థత అవసరం : నీటి లభ్యత పరిమితంగా ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, అధిక నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించి ఉద్యాన పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యాన పంటల విస్తరణలో జిల్లా అధికారులు చురుకుగా పనిచేయాలని ఆదేశించారు…

అధికారుల సమన్వయం కీలకం:  వ్యవసాయ, ఉద్యాన, డీఆర్‌డీఏ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు సాంకేతిక పరిజ్ఞానం చేరవేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు తమ పరిజ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకుంటూ, రైతులకు మార్గనిర్దేశం చేయాలని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, డీఆర్‌డీఏ ప్రతినిధులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top