

రీ-ఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి
పీజీఆర్ఎస్ కు 138 మంది అర్జీదారులు
- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 19 :
ప్రజా సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించి, పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై ప్రత్యేక దృష్టి సారించి, సమయపాలనతో పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రీ-ఓపెన్ అయిన 250 దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి వెంటనే క్లియర్ చేయాలని సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దారులను ఆదేశించారు. ఇంకా చూసుకోని దరఖాస్తులతో పాటు బియాండ్ ఎస్ఎల్ఏ లో ఉన్న 3017 దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. వీఐపీ గ్రీవెన్స్‌లను కూడా అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న సివిల్ సప్లై, ఎపీఎస్పీడీసీఎల్, ఫారెస్ట్, పంచాయతీ తదితర శాఖల్లో ఉన్న ఆడిట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే క్లియర్ చేయాలని సూచించారు.
పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని ప్రజా సమస్యలు:
●గడివేముల మండలం, బుజనూరు గ్రామానికి చెందిన పి. వెంకటరామిరెడ్డికి సర్వే నెం. 463లో 6.50 ఎకరాలు, సర్వే నెం. 50లో 2.50 ఎకరాల భూమి ఉన్నదని తెలిపారు. సదరు భూమిని జెఎస్‌డబ్ల్యూ సిమెంటు కంపెనీ వారు ఆక్రమించుకుని మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఇందుకు సంబంధించి ఎలాంటి పరిహారం లేదా నగదు చెల్లించకుండా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.
●పాములపాడు మండలం, వేంపెంట గ్రామానికి చెందిన బోయ రమణయ్య తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.
●దొర్నిపాడు మండలం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన కె. వెంకయ్య తాను వైకల్యంతో బాధపడుతున్నానని పేర్కొంటూ, తనకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయగలరని అభ్యర్థిస్తూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం138 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. స్వీకరించిన అర్జీలన్నింటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
