మార్చి 16వ తేది నుండి ఏప్రిల్ 1వ తేది వరకు పరీక్షలు
పరీక్ష సమయం ఉ.9:30 గం.ల నుంచి మ.12:45 గం.ల వరకు
జిల్లాలో 130 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 20 :
పదవ తరగతి పరీక్షలు నిర్వహణ పకడ్బందీగా నిర్వహించి ఎటువంటి ఇబ్బందులకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిఆర్ఓ ఛాంబర్ లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ సూర్యమౌళి, జిల్లా ఖజానా అధికారి లక్ష్మీదేవి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 01వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అందుకు జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 18,510 మంది, వొకేషనల్ విద్యార్థులు 6,268 మంది, ప్రైవేటు విద్యార్థులు 257 మంది మొత్తంగా 25,035 మంది విద్యార్థులు సజావుగా నిర్వహించడానికి 130 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేయాలని, ఫ్లయింగ్ స్క్వాడ్లకు డిప్యూటీ తహశీల్దార్లను కేటాయించాలని డీఆర్ఓ ఆదేశించారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం జరగదన్నారు. పరీక్షా నిర్వహణ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తిన తక్షణమే సంబంధిత సిబ్బంది పరిష్కరించేలా డిఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్:9515185150 ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.
పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను డిఆర్ఓ సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో తగినంత లైటింగ్ కల్పించాలన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసిఉంచేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాలను తగిన భద్రతతో పోస్టల్ కార్యాలయాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోస్టల్ శాఖ అధికారులను ఆదేశించారు.
