

నంద్యాల జిల్లా / డిసెంబర్ 31 – 2025 / సత్యం వార్త ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన బనగానపల్లి రెవెన్యూ డివిజన్ నేటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బనగానపల్లి కొత్త రెవెన్యూ డివిజన్ ప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, డిఆర్ఓ రాము నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారి, సిబ్బంది మరియు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొత్త రెవెన్యూ డివిజన్‌కు డోన్ ఆర్డీఓ నరసింహులు ఇంచార్జి ఆర్డీఓగా పదవీ బాధ్యతలు చేపట్టారని తెలిపారు. గతంలో బనగానపల్లి నియోజకవర్గ పరిధిలోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలు నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో, అలాగే బనగానపల్లి, అవుకు, కోవెలకుంట్ల మండలాలు డోన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేవని తెలిపారు. ఈ కారణంగా ప్రజలు తమ అవసరాల నిమిత్తం నంద్యాల లేదా డోన్ పట్టణాలకు వెళ్లాల్సి వచ్చి అనేక ఇబ్బందులు, వ్యయ ప్రయాసలు ఎదుర్కొనేవారని వివరించారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, బనగానపల్లి నియోజకవర్గంలోని మొత్తం ఐదు మండలాలను ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకురావడం ఆనందకర పరిణామమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ కొత్త రెవెన్యూ డివిజన్ ద్వారా పరిపాలన మరింత వేగవంతమై, సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించగలుగుతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రారంభమైన బనగానపల్లి రెవెన్యూ డివిజన్ కార్యకలాపాలు ప్రజలకు మరింత ఉపయోగకరంగా, పారదర్శకంగా సాగాలని, అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
