స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ,డీఐజీ మరియు రాజకీయ పెద్దల పేర్లు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు – తీవ్ర ఉద్రిక్తత

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 21 :
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి..ఇప్పటికే రిజిస్ట్రేషన్ లావాదేవీలు,టోకెన్ వ్యవస్థ,ఫీజుల నిర్వహణపై సబ్ రిజిస్ట్రార్ మరియు సిబ్బంది మధ్య ఘర్షణ కొనసాగుతుండగా, తాజాగా కార్యాలయ సిబ్బంది సంచలన ఆరోపణలు బహిరంగంగా చేయడం కలకలం రేపుతోంది..కార్యాలయ సిబ్బంది వర్గాలు ఆరోపిస్తున్నదేమిటంటే – సబ్ రిజిస్ట్రార్ అధికారి స్వయంగా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ,డీఐజీ స్థాయి అధికారులకు మరియు రాజకీయ పెద్దలకు భారీ మొత్తం లక్షల్లో డబ్బులు చెల్లించి,ఈ స్థానానికి వచ్చానని,తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకునే వరకు సిబ్బందికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు…ఈ వ్యాఖ్యలు సబ్ రిజిస్టర్ అధికారే స్వయంగా కార్యాలయంలోనే బహిరంగంగా చెప్పినట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు..ఈ ఆరోపణలు నిజమైతే ఇది పరిపాలనా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అంశమని కార్యాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..ప్రభుత్వ పదవుల కేటాయింపులో అవినీతి జరిగిందనే సంకేతాలు ఇస్తున్నాయని సిబ్బంది అంటున్నారు..ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..మరోవైపు,సబ్ రిజిస్ట్రార్ వర్గం ఈ ఆరోపణలను ఖండిస్తున్నట్లు సమాచారం..క్రమశిక్షణ చర్యలను తప్పుగా అర్థం చేసుకుని కొందరు సిబ్బంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొంటున్నట్లు తెలిసింది..విధుల్లో పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యమని,ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడటమే ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని సమర్థించుకుంటున్నట్లు సమాచారం..ఇటీవల ఒక రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తలెత్తిన వివాదం తర్వాత ఈ విభేదాలు బహిర్గతమయ్యాయని తెలుస్తోంది..కార్యాలయంలో వర్గాలుగా విభజన ఏర్పడి పరస్పర ఆరోపణలు తీవ్రరూపం దాల్చినట్లు చెబుతున్నారు..ఈ వ్యవహారం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం..అవసరమైతే విభాగీయ విచారణకు ఆదేశాలు జారీ చేసే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి..ఆరోపణల తీవ్రత దృష్ట్యా విజిలెన్స్ లేదా ఏసీబీ విచారణకు కూడా అవకాశముందనే చర్చ సాగుతోంది.
..ప్రజా సేవలకు కేంద్రమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలవడం జిల్లాలో చర్చనీయాంశమైంది..వాస్తవాలు వెలుగులోకి రావాలని,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
