నంద్యాల లో హెచ్‌ఎమ్ జ్యూవెలర్స్ షాపులో వెండి పట్టీలు దొంగతనం చేసిన ఇద్దరు మహిళలు అరెస్ట్

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 18 :

నంద్యాల పట్టణంలోని హెచ్‌ఎమ్ జ్యూవెలర్స్ దుకాణంలో వెండి పట్టీలు దొంగతనం చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి, సుమారు 17 తులాల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు, ఎస్డిపిఓ మందా జావళి ఆల్ఫోన్స్ పర్యవేక్షణలో 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఫిబ్రవరి 12న మధ్యాహ్నం బంగారు అంగళ్ల వీధిలోని హెచ్‌ఎమ్ జ్యూవెలర్స్ షాపులోకి కొనుగోలు కోసం వచ్చినట్లు నటించిన ఇద్దరు మహిళలు సుమారు 17 తులాల వెండి పట్టీలు అపహరించినట్లు దుకాణ యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా బుధవారం ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ సమీపంలో మదనపల్లికి చెందిన వేముల జ్యోతి, వేముల నరసమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రెండు జతల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును వారం రోజుల్లో ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వ్యాపార స్థావరాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వాలని సిఐ సూచించారు.

Scroll to Top