


రూ. 3 కోట్లతో చామకాల్వ పై బ్రిడ్జి నిర్మాణం
ఎన్ కే రోడ్డు -ఎన్జీవో కాలనీకి నేరుగా అనుసంధానం
శ్రీరామ థియేటర్ వెనుక డి ఎల్ ఆర్ బి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి
వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంకు చర్యలు
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 24 :
నంద్యాల పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీని శాశ్వత ప్రాతిపదికన నియంత్రించేందుకు వీలుగా స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చర్యలు చేపట్టారు. పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న లో – లెవెల్ బ్రిడ్జి వద్ద వరదల సమయంలో రాకపోకలు బంద్ కష్టాలు, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురు రోడ్డు నుంచి ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎన్జీవో కాలనీకి శ్రీనివాస నగర్ – నూనెపల్లె (ఎన్ కే రోడ్డు ) నుంచి రాకపోకల అనుసంధానం చేస్తే ట్రాఫిక్ నియంత్రణకు మార్గం సుగుమం అవుతుందని మంత్రి ఫరూక్ దూరదృష్టి తో ఆలోచించి సంబంధిత అధికారుల చేత ప్రతిపాదన చేయించి, ఆ ప్రతిపాదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన అంశాలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్ నగర్ – నూనెపల్లె ప్రధాన రహదారి( ఎన్ కే రోడ్డు )లోని కేసీ కెనాల్ కార్యాలయం ఎదురుగా శ్రీరామ థియేటర్ – అప్సర బార్ భవనం మధ్య ఉన్న అప్రోచ్ రోడ్డు లో చామ కాల్వ పై 2.5 కి. మీ వద్ద డబుల్ లైన్ రోడ్డు బ్రిడ్జి ( డి ఎల్ ఆర్ బి) నిర్మాణం కోసం రూ.3.075 కోట్లు( మూడు కోట్ల, 7 లక్షల 50 వేలు) మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది.
డి ఎల్ ఆర్ బి నిర్మాణంతో :
===========
నంద్యాల పట్టణంలోని శ్రీరామ థియేటర్ వెనుక వైపు చామకాలువపై 2.5 కి. మీ వద్ద డబుల్ లైన్ రోడ్డు బ్రిడ్జి(డి ఎల్ ఆర్ బి ) నిర్మాణంతో ఎన్జీవో కాలనీకి నేరుగా రాకపోకల అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం శ్రీనివాస్ నగర్ – నూనెపల్లె ప్రధాన రహదారిలో నుంచి ఎన్జీవో కాలనీకి రెండు మార్గాల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయి. ఇందులో ఒకటి టేక్కే ఏటీఎం సెంటర్ నుంచి రామకృష్ణ డిగ్రీ కళాశాల మీదుగా దూరదర్శన్ కేంద్రం రోడ్డులో నుంచి ఎన్జీవో కాలనీకి రాకపోకలు జరుగుతున్నాయి. రెండవది ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి ఎన్జీవో కాలనీ వైపు రాకపోకలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రోడ్డులో నుంచి ఎన్జీవో కాలనీకి వెళ్లేందుకు ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. భారీ వర్షాల సమయంలో చామకాల్వకు ఎగువ నుంచి వరద పోటెత్తితే రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న లో- లెవెల్ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తుంది. ఆ సమయంలో ఎస్బిఐ కాలనీ నుంచి ఎన్జీవో కాలనీకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి.వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురురోడ్డు నుంచి ఎన్జీవో కాలనీ కి వెళ్లే మార్గంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని మంత్రి ఫరూక్ ప్రత్యేకంగా దృష్టి సారించి డిఎల్ ఆర్ బి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ థియేటర్- అప్సర బార్ మధ్య ప్రస్తుతం ఉన్న అప్రోచ్ రోడ్డు లో చామకాల్వ పై డి ఎల్ ఆర్ బి నిర్మాణం పూర్తి అయితే మెయిన్ రోడ్డు నుంచి ఎన్జీవో కాలనీకి నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. దీంతో ఎన్జీవో కాలనీ, పొన్నాపురం కాలనీ మీదుగా విజయ డెయిరీ వరకు వెళ్లేందుకు నేరుగా రాకపోకలకు శాశ్వతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుసంధానం ఏర్పడుతుండడంతో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అవకాశం ఏర్పడుతుందని అధికార వర్గాల స్పష్టం చేస్తున్నాయి. మరో పక్క భారీ వర్షాల సమయంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న చామకాల్వ లో -లెవెల్ బ్రిడ్జి వద్ద వరద నీరు ప్రభావంతో ఎన్జీవో కాలనీకి రాకపోకలు నిలిచి పోవడం సమస్యకు శాశ్వతంగా చెక్ పడుతుంది. శ్రీరామ థియేటర్ వెనుక డి ఎల్ ఆర్ బి నిర్మాణంతో వరదతో రాకపోకలు బంద్ అన్నమాట భవిష్యత్తులో వినపడదు. శ్రీరామ థియేటర్- అప్సర బార్ మధ్య ఉన్న రోడ్డులో చామకాల్వ పై డి ఎల్ ఆర్ బి నిర్మాణం, అటువైపు నుంచి ప్రస్తుతం ఉన్న మెటల్ రోడ్డును భవిష్యత్తులో బీటీ లేదా సిసి రోడ్డు గా మార్చేందుకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. దీంతో నంద్యాల పట్టణంలో అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉన్న ఎన్జీవో ప్రాంతానికి నేరుగా అనుసంధానం ఏర్పడి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారం అవుతుంది.
నంద్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం – మంత్రి ఫరూక్
=============
నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. నంద్యాల పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతర్గత రహదారుల అనుసంధానం పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఇందులో భాగంగానే ఎన్జీవో కాలనీకి అనుసంధానం కోసం ప్రస్తుతం ఉన్న రెండు మార్గాల్లో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని, మూడవ మార్గంను అనుసంధానించేందుకు కార్యాచరణ రూపొందించాము. శ్రీరామ థియేటర్ వెనుక చామకాల్వపై డి ఎల్ ఆర్ బి నిర్మిస్తే వరదల సమయంలో రాకపోకల బంద్ సమస్య పరిష్కారం, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురు రోడ్డు నుంచి ట్రాఫిక్ రద్దీ కూడా నియంత్రించబడుతుంది. శ్రీనివాస నగర్ – నూనెపల్లె ప్రధాన రహదారి నుంచి డిఎల్ ఆర్ బి మీదుగా నేరుగా ఎన్జీవో కాలనీకి వెళ్లి రావచ్చు. చామకాల్వ 2.5 కి. మీ వద్ద డిఎల్ ఆర్ బి నిర్మాణానికి రూ. 3 కోట్లు మొత్తాన్ని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడం జరిగింది. తదుపరి చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేస్తాం. శాశ్వత ప్రాతిపదికన నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.
నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.. కేసీ కెనాల్ ఇంజనీర్లు
చామకాల్వపై డి ఎల్ ఆర్ బి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేసీ కెనాల్ డీఈ రవికుమార్,ఏఈ అబ్దుల్ మునాఫ్ వెల్లడించారు. ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మూడు రోజుల వ్యవధిలోనే నిర్మాణ పనులు చేపట్టేందుకు కార్యచరణ అమలు చేయబోతున్నట్లు డిఈ, ఏఈ లు తెలిపారు.
