

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 21 :
నంద్యాల మండలం చాబోలు గ్రామ పరిధిలో వాగు పోరంబోకు భూమిపై నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ వ్యవహారంపై నంద్యాల రూరల్ తాసిల్దార్ శ్రీవాణి స్పష్టమైన ప్రకటన చేశారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 28లో మొత్తం 4 ఎకరాలు 18 సెంట్లు వాగు పోరంబోకు భూమి ఉందని,అందులో సుమారు రెండు ఎకరాల్లో అనధికారికంగా ముస్లిం మైనార్టీ నాయకులు మసీదు ఏర్పాటు చేసేందుకు షెడ్డు నిర్మించిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఈ విషయమై ఇప్పటికే మైనర్ ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.
అలాగే,అనధికారంగా షెడ్డు నిర్మించిన వారికి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తిచేసి,పోలీసుల సమక్షంలో వాగు పోరంబోకులో ఏర్పాటుచేసిన షెడ్డును కూల్చివేయడం ఖాయం అని తాసిల్దార్ ఘాటుగా హెచ్చరించారు.
తాసిల్దార్ మాట్లాడుతూ…“వాగు పోరంబోకు భూమి ప్రభుత్వ ఆస్తి..ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మతపరమైన అంశంగా కాకుండా,ఇది పూర్తిగా భూసంరక్షణకు సంబంధించిన విషయం” అని స్పష్టం చేశారు…పరిస్థితి ఉద్రిక్తం..గ్రామంలో ఈ పరిణామాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు మైనార్టీ నాయకులు ప్రార్థనల కోసం తాత్కాలికంగా షెడ్డు ఏర్పాటు చేశామని చెబుతుండగా,మరోవైపు రెవెన్యూ అధికారులు ఇది స్పష్టమైన ఆక్రమణేనని అంటున్నారు.
పోలీసు బందోబస్తు..అనుకోని ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే అదనపు బలగాలు మోహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
తదుపరి చర్యలు..భూసర్వే తిరిగి నిర్వహించే అవకాశాలు.. మైనర్ ఇరిగేషన్ శాఖ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం.. ఆక్రమణదారులపై చట్టపరమైన కేసులు నమోదు చేసే అవకాశం.. ప్రభుత్వ భూముల విషయంలో రాజీ లేదని,చట్టమే పరమావధి అని అధికారులు స్పష్టం చేయడంతో..చాబోలు గ్రామంలో పరిస్థితులు ఎలా మలుపుతిరుగుతాయో చూడాలి.
