




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 15 :
నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ‘దావత్-ఏ-ఇఫ్తార్’ (ఇఫ్తార్ విందు) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ విందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , నంద్యాల బిషప్ ప్రసన్న కుమార్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్ , నంద్యాల ఆర్డీవో విశ్వనాధ్, నంద్యాల డిఎస్పి మంద జావళి , ఎమ్మార్వో శ్రీనివాసులు, డిఎండబ్ల్యూఓ సబిహా పర్వీన్, ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాషా సిద్ధికి, నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్, దూదేకుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబాన్ తదితరులు హాజరయ్యారు. సాయంత్రం ప్రార్థనల అనంతరం అతిథులు మరియు ముస్లిం సోదరులు కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని, ఇలాంటి సామూహిక ఇఫ్తార్ విందులు మత సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గారితో పాటు ఇతర ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ప్రేమకు, త్యాగానికి ప్రతీక అన్నారు . ముస్లిం సోదరుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవంతో ఉందని, మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధిలో ముస్లింల పాత్ర కీలకమని, భవిష్యత్తులో కూడా అందరం ఐక్యమత్యంతో కలిసి మెలిసి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, ముస్లిం మైనార్టీ నాయకులు, స్థానిక నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
