నంద్యాల జిల్లాలో దేశంలోనే అతిపెద్ద 600/1200 మెగావాట్ల సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్

అత్యవసర సమయాల్లో నగరాలకు తక్షణ విద్యుత్ సరఫరాకు కీలకంగా నిలవనున్న ప్రాజెక్ట్

డిసెంబర్ నాటికి ప్రాజెక్టు ప్రారంభానికి లక్ష్యం

  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 20 :
నంద్యాల జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే దిశగా దేశంలోనే అతిపెద్ద 600/1200 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ఏర్పాటు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న భారీ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, SECI డైరెక్టర్ శివకుమార్, డిప్యూటీ మేనేజర్లు శుభమ్ మిశ్రా, రోహిత్ చౌహాన్ సంబంధిత తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో 38.4 ఎకరాల విస్తీర్ణంలో SECI ద్వారా 600/1200 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ స్థాపనకు భారత ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు నంద్యాల జిల్లాకు రావడం గొప్ప గౌరవమని, ఇది రాష్ట్రానికే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా నంద్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుందని అన్నారు. డిసెంబర్ నాటికి ప్రాజెక్టును ప్రారంభించాలనే లక్ష్యంతో SECI ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ, ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. భారీ గ్రీన్ ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం వల్ల జిల్లా ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతుందని, తద్వారా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అలాగే, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన జిల్లాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కూడా అదే దిశగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

SECI డైరెక్టర్ శ్రీ శివకుమార్ మాట్లాడుతూ, చాలా తక్కువ సమయంలో భూకేటాయింపు పూర్తిచేసి ప్రాజెక్టుకు అనుకూల వాతావరణం కల్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాను ప్రత్యేకంగా అభినందించారు. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు సకాలంలో మంజూరు కావడంలో జిల్లా కలెక్టర్ సమర్థ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేయడంలో నంద్యాల జిల్లా యంత్రాంగం చూపుతున్న చొరవ ప్రశంసనీయమన్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం, వేసవి కాలంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో దేశంలోని ప్రధాన నగరాలకు విద్యుత్ కోతలు లేకుండా తక్షణమే 1200 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడమేనని ఆయన వివరించారు. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర, పవన శక్తుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, అవసరమైనప్పుడు విద్యుత్ నిల్వ చేసి, అవసరమైన సమయాల్లో గ్రిడ్‌కు సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టును నిర్ణీత గడువులో మరింత వేగవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పరిష్కరించాల్సిన కీలక అంశాలను SECI ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా 665 కేవీ టవర్ల స్థల మార్పిడి, 765 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ మార్పిడి, ప్రాజెక్ట్ విస్తరణ కోసం అదనపు ప్రభుత్వ భూమి కేటాయింపు, అలాగే ప్రాజెక్ట్ సైట్‌కు చేరుకునేందుకు అవసరమైన రహదారి సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలను వారు ప్రస్తావించారు. ఈ సమస్యలన్నింటిపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇదే సందర్భంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్రాజెక్ట్ ప్రాధాన్యతను కూడా అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పునరుత్పాదక శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, పీక్ అవర్స్‌లో విద్యుత్ సరఫరా నిరంతరంగా అందించడం, గ్రిడ్ స్థిరత్వాన్ని పెంపొందించడం సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరాఘాటంగా విద్యుత్ అందించే సామర్థ్యం ఈ ప్రాజెక్ట్‌కు ఉందని, కాలుష్యరహిత గ్రీన్ ఎనర్జీ పరిష్కారంగా ఇది భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డోన్/బనగానపల్లె ఇన్‌చార్జి ఆర్డీఓ నరసింహులు, పరిశ్రమల శాఖ జీఎం మహబూబ్ బాషా, నేడ్కాప్ అధికారి వీరేంద్రతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top