నంద్యాలలో ఘనంగా హజ్ యాత్రికుల వ్యాక్సినేషన్ మరియు మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ – ముఖ్యఅతిథిగా పాల్గొన్న నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

​ సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 09 :

నంద్యాల పట్టణంలోని నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం హజ్-2026 యాత్రికుల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు మరియు వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు మరియు నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్. ఇంతియాజ్ అహ్మద్ అధ్యక్షత వహించారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా టీడీపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై, యాత్రికులకు ఉద్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్భంగా హజ్ యాత్రికులను ఉద్దేశించి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ హజ్ యాత్ర అనేది జీవితంలో ఒక పవిత్రమైన ఘట్టమని, యాత్రికులందరూ సౌదీ అరేబియాలో అత్యంత క్రమశిక్షణతో మరియు ఆరోగ్యంగా యాత్రను పూర్తి చేయాలని ఆయన కోరారు. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం వ్యాక్సినేషన్ తీసుకోవడం తప్పనిసరి అని, ఇది యాత్రికుల రక్షణ కోసమేనని ఆయన వివరించారు. ఈ దిశగా హజ్ కమిటీ చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విమాన ప్రయాణం నుంచి బస వరకు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పవిత్రమైన మక్కా, మదీనా సందర్శన సమయంలో దేశం సుభిక్షంగా ఉండాలని, నంద్యాల జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆయన యాత్రికులను కోరారు.

ఈ సందర్భంగా యాత్రికులను ఉద్దేశించి డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లే అల్లాహ్ అతిథులకు సేవ చేయడం తమ విద్యాసంస్థలకు మరియు హజ్ సొసైటీకి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా నుండి వెళ్లే ప్రతి యాత్రికుడికి అప్లికేషన్ ప్రక్రియ నుండి యాత్ర ముగిసి తిరిగి వచ్చే వరకు జిల్లా హజ్ సొసైటీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. యాత్రలో వాతావరణ మార్పులను తట్టుకోవడానికి మరియు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రతీ యాత్రికుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, ఆరోగ్య నియమాలను పాటించాలని ఆయన సూచించారు. ఈ క్యాంప్ విజయవంతం కావడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, వ్యాక్సినేషన్ సిబ్బందికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఎండి ఫిరోజ్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ మహమ్మద్ గౌస్ పీర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సి. సుదర్శన్ బాబు, ప్రసన్న లక్ష్మి, నేషనల్ కాలేజీల సెక్రటరి రఫీ అహ్మద్, మౌలానా అబ్దుల్ హాదీ, మౌలానా మహబూబ్ బాషా, హాఫిజ్ షరీఫ్, షబ్బీర్, రఫీ మరియు హజ్ కమిటీ ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top