- ప్రారంభించిన రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి
- రెండు రోజులపాటు జరిగే టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల జిల్లాల నుండి 300 మంది పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.
- విజేతలకు 3 లక్ష రూపాయల నగదు బహుమతులు,ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు ఆదివారం సాయంత్రం అందజేస్తారు.


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 21 :
ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ శనివారం నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన,నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి టోర్నమెంట్ లాంచనంగా ప్రారంభించారు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ను డాక్టర్ రవికృష్ణ, రామకృష్ణ విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత రెడ్డి చెస్ బోర్డుపై పావులు కదిలించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చదరంగం మెదడుకు పదును పెట్టే క్రీడ అని, నంద్యాలలో అంతర్జాతీయ రేటింగ్ టోర్నమెంట్ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. చెస్ అభివృద్ధి కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులను చదువుతోపాటు క్రీడలలో ప్రోత్సహించాలని విద్యాసంస్థల యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ క్రీడాకారులలో ఏకాగ్రత ఇనుముడింప చేస్తుందని, గెలుపు ఓటములను స్వీకరించే మానసిక స్థైర్యం అలవడుతుందని తద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.
హేమంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులపై మార్కులు,ర్యాంకులు కోసం ఒత్తిడి పెంచరాదని, చదువుతోపాటు క్రీడలు, కళలలో ప్రోత్సహించడం ద్వారా వారికి మానసిక వికాసం జరుగుతుందని అన్నారు.
జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న వివిధ జిల్లాల నుండి 300 మంది పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. విజేతలకు 3 లక్ష రూపాయల నగదు బహుమతులు, ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు ఆదివారం సాయంత్రం ప్రదానం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్,డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ మణికంఠ,నంద్యాల జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి, టోర్నమెంట్ నిర్వాహకురాలు సుజాత, క్రీడాకారులు, కోచ్ లు, క్రీడాకారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
