
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 11 :
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానంది శ్రీ మహానందీశ్వర స్వామి మరియు అమ్మవార్ల ఉత్సవమూర్తులు బుధవారం నంద్యాల పట్టణానికి పయనమయ్యారు. కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సంప్రదాయంగా పెళ్లిపెద్దలుగా ఆహ్వానించాల్సిన నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామి సమేత పార్వతి గంగాదేవి అమ్మవారిని ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
వేదమంత్రాల నడుమ, మంగళవాయిద్యాల మధ్య ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా బయలుదేరారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మహానంది నుంచి నంద్యాల వరకు ఉత్సవమూర్తుల పయనం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.
