దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు సుబ్బారెడ్డి మృతికి నివాళి

సుబ్బారెడ్డి మృతి నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘానికి తీరని లోటు: డాక్టర్ రవి కృష్ణ.

రెండున్నర దశాబ్దాలుగా దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేసిన సుబ్బారెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 16 :
నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, గతంలో డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా సుదీర్ఘకాలం దివ్యాంగుల సంక్షేమానికి కృషిచేసిన కె.వి.సుబ్బారెడ్డి గురువారం స్వగ్రామం కొత్తపల్లిలో అస్వస్థతతో మృతి చెందడం జరిగింది. శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు రమణయ్య, ప్రధాన కార్యదర్శి రామలింగం తదితరులు సుబ్బారెడ్డి గృహానికి వెళ్లి నివాళులర్పించారు.
మధ్యాహ్నం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సంతాప సభలో డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య మాట్లాడుతూ సుబ్బారెడ్డి తన వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి దివ్యాంగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. 70% పైగా వైకల్యం ఉన్నప్పటికీ స్వంతంగా ఇంటి దగ్గర కిరాణా దుకాణం నడిపి కుటుంబ పోషణ భారాన్ని తన భుజస్కందాలపై మోసిన ధైర్యశాలి అని కొనియాడారు.
అనేక సంవత్సరాలు భవాని మాల ధరించి కనకదుర్గమ్మ ఆలయాన్ని పట్టుదలతో ,ఆత్మవిశ్వాసంతో వెళ్లి దర్శించేవాడని గుర్తు చేశారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడిగా సంఘం అభివృద్ధికి, దివ్యాంగుల సంక్షేమానికి రెండున్నర దశాబ్దాలుగా సుబ్బారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన మృతి దివ్యాంగుల సంక్షేమ సంఘానికి తీరని లోటుగా మిగిలి పోతుందనీ, సుబ్బారెడ్డి మృతి తీవ్ర ఆవేదన కలిగిస్తున్నదన్నారు. సుబ్బారెడ్డి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని,వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామన్నారు.
ఈ సంతాప సభలో డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య లతో పాటు సంఘం ప్రతినిధులు రామలింగం, వెంకటరావు, హనీఫ్ ఖాన్, షాహినూర్, మధు, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, సభ్యులు తోట శ్రీనివాస్, వాసు,రామయ్య,ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు విజయభాస్కర రెడ్డి, కళారాధన సభ్యులు శివరామిరెడ్డి, రామస్వామి, బాలచంద్రుడు, సూర్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Scroll to Top