


తేదీ: 29-12-2025న, (సోమవారం) విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జనాబ్ ఎన్.ఎం.డి. ఫరూక్, గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు, శ్రీ బోడె ప్రసాద్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దూదేకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగుల్ మీరా, నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ తదితర ప్రముఖులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు టీడీపీ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ —
“ఉర్దూ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదు; అది మన సంస్కృతి, సాహిత్యం, ఆధ్యాత్మికతకు ప్రతీక. శతాబ్దాల చరిత్రను తన గర్భంలో దాచుకున్న ఉర్దూ భాషను పరిరక్షించడం మన అందరి బాధ్యత” అని పేర్కొన్నారు.
ఉర్దూ భాష అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మైనారిటీ యువతకు ఉర్దూ భాష ద్వారా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉర్దూ పాఠశాలలు, కళాశాలలు, పరిశోధనా కేంద్రాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి గల నాయకత్వంలో మైనారిటీల సమగ్ర అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మైనారిటీల విద్య, ఆర్థిక సాధికారత, భాషా సంరక్షణకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఈ వేదికపై స్పష్టంగా తెలియజేశారు.
“ఉర్దూ భాష వెలుగులు తరతరాల వరకు విస్తరించాలంటే మనమంతా ఏకమై పనిచేయాలి. ఉర్దూ భాషకు గౌరవం కల్పిస్తూ, దానిని రాబోయే తరాలకు అందించే బాధ్యత మనందరిదే” అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ భాషాభిమానులు, మేధావులు, మైనారిటీ నాయకులు, పార్టీ ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
