

జిల్లా స్థూల దేశీయోత్పత్తి వృద్ధే లక్ష్యంగా సమగ్ర ప్రణాళికలు
స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా అభివృద్ధికి బలమైన అడుగులు
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 13 :
జిల్లా స్థూల దేశీయోత్పత్తి (డీడీపీ) పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని స్వర్ణాంధ్ర@2047 జిల్లా విజన్ ప్లాన్ యూనిట్‌లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, పి–4 (ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమం, జిల్లా ప్రగతి సూచికలపై జిల్లా కలెక్టర్ విజన్ ప్లాన్ యూనిట్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఓ ఓబులేసు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో జిల్లా విజన్ ప్లాన్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, 7 నియోజకవర్గాల పరిధిలో కూడా ప్రత్యేక విజన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా యూనిట్లలో విధులు నిర్వహించేందుకు యంగ్ ప్రొఫెషనల్స్ (యువ నిపుణులు) ను నియమించామని, వీరంతా వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తూ మండలాల స్థాయిలో ప్రగతికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ప్రతి విభాగంలో కనీసం 15 శాతం పురోగతి సాధించాల్సి ఉందని, అందుకు అనుగుణంగా ఉత్తమ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తలసరి ఆదాయం అధికంగా (రూ.3 లక్షలకు పైగా) ఉన్న మండలంగా మహానంది ఉండగా, తక్కువ తలసరి ఆదాయం (రూ.లక్ష వరకు) ఉన్న మండలాలుగా నందికొట్కూరు, పగిడ్యాల ఉన్నాయని వివరించారు. అన్ని మండలాల్లో సమానమైన తలసరి ఆదాయం సాధించడంతో పాటు, రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థూల దేశీయోత్పత్తి పెరిగేలా విజన్ ప్లాన్ యూనిట్లు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అమలు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
అదేవిధంగా పి–4 (ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 4,585 మంది మార్గదర్శులుగా నమోదు కాగా, 36,767 బంగారు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న వారు పొందుతున్న ప్రయోజనాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రగతి సూచికల విషయంలో ఎలాంటి అలసత్వం వహించకుండా, కీ పర్ఫామెన్స్ ఇండికేటర్లను ఎప్పటికప్పుడు నమోదు చేసి నవీకరించేలా చర్యలు తీసుకోవాలని విజన్ ప్లాన్ యూనిట్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
