జాతీయ రోడ్డు భద్రతా మాసం–2026 ప్రారంభం – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల జిల్లా / జనవరి 01- 2026 / సత్యం వార్త ప్రతినిధి :
ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడమే నిజమైన రోడ్డు భద్రత అని, ప్రజల సహకారం మరియు సమిష్టి కృషితోనే సురక్షిత రహదారులను సాధించవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయ ఆవరణలో నూతన సంవత్సర సందర్భంగా జాతీయ రోడ్డు భద్రతా మాసం – 2026 ప్రారంభోత్సవ బ్యానర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ రోడ్డు భద్రత బ్యానర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రహదారుల పై జరుగుతున్న ప్రమాదాలు అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టుతున్నాయని తెలిపారు. ఇది కేవలం గణాంకాల అంశం కాదని, సమాజంగా మనందరి బాధ్యతగా భావించి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2024 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, ముఖ్యంగా యువత, ద్విచక్ర వాహనదారులు మరియు పాదచారులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో రోడ్డు భద్రతపై సమగ్ర దృష్టి సారించడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ ఏడాది జాతీయ రోడ్డు భద్రతా మాసం నినాదంగా ఎంపిక చేసిన“శిక్షతో భద్రత, సాంకేతికతతో పరివర్తన”, రోడ్డు భద్రత సాధనకు ఎంతో ప్రాసంగికమైనదని కలెక్టర్ పేర్కొన్నారు. శిక్షతో భద్రత అనగా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రజల్లో బాధ్యతాయుతమైన వాహన చలనం అలవాట్లను పెంపొందించడమని వివరించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరిగా ఉండాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదన్న స్పష్టమైన సందేశం ప్రతి ఒక్కరికి చేరాల్సిన అవసరం ఉందని తెలిపారు.

జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ సాంకేతికతతో పరివర్తన అనగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోడ్డు ప్రమాదాలను ముందుగానే నివారించడమని పేర్కొన్నారు. AI ఆధారిత కెమెరాలు, స్పీడ్ మానిటరింగ్ వ్యవస్థలు, ప్రమాదకర ప్రాంతాల (బ్లాక్ స్పాట్స్) గుర్తింపు, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి చర్యల ద్వారా రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని వివరించారు. రోడ్డు భద్రత లక్ష్య సాధనకు పోలీస్, ఆర్ & బీ, వైద్య & ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖలు, APSRTC, NHAI తదితర అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసం సందర్భంగా జిల్లాస్థాయిలో రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు కొలిచే లక్ష్యాలను నిర్దేశించుకొని, జీరో ఫాటాలిటీ దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్, ఎస్పీలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా అధికారి శివారెడ్డి ఆర్అండ్బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top