జనవరి 30న ఉద్యోగుల సమస్యల పరిష్కార కార్యక్రమం – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 19 :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి ఈ నెల 30వ తేదీన ప్రత్యేక సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో భాగంగా ఉద్యోగ సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా జనవరి 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలను అర్జీ స్వీకరించిన 15 రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలను సంబంధిత ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులకు సంబంధించిన వార్షిక ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, మహిళా ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ వివరించారు. అలాగే ఉద్యోగులపై నమోదైన క్రమశిక్షణారాహిత్య కేసులు ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉండడం వల్ల పదోన్నతులు, ఇంక్రిమెంట్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోందని, అటువంటి కేసులకు సంబంధించిన అర్జీలను కూడా ఈ కార్యక్రమంలో పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top