
క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి: మంత్రి ఫరూక్.
గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కరపత్రాలు విడుదల చేసిన మంత్రి ఫరూక్
నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ శిబిరాలు.
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి /జనవరి 5 :
భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణ పరీక్షా శిబిరాల కరపత్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు.
ఐఎంఏ నంద్యాల శాఖ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. నంద్యాల మహిళా వైద్య విభాగం మహిళలలో వచ్చే క్యాన్సర్లపై అవగాహన కల్పించి, అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. పరీక్షలు చేయించుకోవడానికి సంశయించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరిలోనైనా ఉన్నప్పుడు ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. మంత్రి ఫరూక్ తో పాటు పాల్గొన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో “సేవే స్ఫూర్తిగా, బాధ్యతే బాటగా” సేవా కార్యక్రమాలు గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అన్నారు. మంత్రి ఫరూక్ గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలులో క్యాన్సర్ ఆసుపత్రికి నిధులు కేటాయించి ప్రాజెక్టు ఆమోదించారని, ఇప్పుడు కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభమై అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు అక్కడ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత డాక్టర్ శైలజ లు మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ( సర్వైకల్ క్యాన్సర్) ను ప్రాథమిక దశలోనే గుర్తించడం కోసం నంద్యాలలో ఉన్న అన్ని స్త్రీ వ్యాధి నిపుణుల ప్రైవేట్ ఆసుపత్రులలో వారం రోజులపాటు 30 సంవత్సరాలు దాటిన మహిళలకు పాప్ స్మియర్ పరీక్షలు, హెచ్.పి.వి. డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవారికి 70 శాతం రాయితీ తో వెయ్యి రూపాయలకే ఈ పరీక్షలు చేస్తామని, పేదలకు ఐఎంఏ తరఫున ఉచితంగా చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ, అకాడమిక్ విభాగం కార్యదర్శి డాక్టర్ లలిత, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ అనిల్ కుమార్ ,డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, డాక్టర్ వసుధ,ఐఎంఏ నంద్యాల పూర్వ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.
