కరిమద్దుల రైతుల సాగునీటి సమస్యపై మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ తక్షణ స్పందన

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 23 :

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని కరిమద్దుల గ్రామ రైతులకు ఎదురవుతున్న సాగునీటి సమస్యపై రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సానుకూలంగా స్పందించారు.

సోమవారం నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కరిమద్దుల గ్రామస్తులు, రైతులు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ పొలాలకు నీరు అందక పడుతున్న ఇబ్బందులను, సాగునీటి ఎద్దడిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల సమస్యలను విన్న వెంటనే స్పందించిన మంత్రి ఫరూక్ అక్కడికక్కడే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తో ఫోన్లో మాట్లాడారు. కరిమద్దుల రైతుల సమస్యను వివరించి, సాగునీటి విడుదలపై చర్చించారు. అనంతరం సాగునీటి శాఖ సీఈ కబీర్ భాష తో మాట్లాడి, క్షేత్రస్థాయిలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించి త్వరితగతిన రైతులకు నీరు అందేలా చూడాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కరిమద్దుల గ్రామ రైతుల సమస్యను అత్యంత త్వరగా పరిష్కరించి, పంటలకు నీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సానుకూల స్పందన పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు ఈశ్వర్ రెడ్డి, రైతులు పూల చంద్రారెడ్డి, నాగ మల్లయ్య, శివారెడ్డి, చంద్రారెడ్డి మరియు గ్రామ రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

Scroll to Top