కమిషనర్‌ను కలవాలంటే చెమటలు – ప్రజలకు అందని మున్సిపల్ అధికారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 25:
నంద్యాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్‌ను ప్రత్యక్షంగా కలవడం ప్రజలకు కష్టసాధ్యంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సమస్యలను వివరించేందుకు కార్యాలయానికి వచ్చే సాధారణ ప్రజలకు సరైన అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది.
పట్టణానికి చెందిన పలువురు ప్రజలు తమ వ్యక్తిగత మరియు ప్రాంతీయ సమస్యలను తెలియజేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నారు. అయితే కమిషనర్‌ను కలవడానికి అనుమతి కోరితే, “సార్‌కు టైమ్ లేదు”, “ఇప్పుడు బిజీగా ఉన్నారు”, “తర్వాత రండి” అని అటెండర్లు చెప్పడం సాధారణంగా మారిందని వారు వాపోతున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు, మహిళలు, సాధారణ ప్రజలు గంటల తరబడి ఎదురుచూసి చివరకు వెనుదిరగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను వినాల్సిన బాధ్యత ఉన్న అధికారి అందుబాటులో లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుకూలం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రజల కోసం కేటాయించి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలను కలవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా మున్సిపల్ కార్యాలయంలో స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలు విని వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Scroll to Top