

రూ.113.90 లక్షల రాయితీలకు కమిటీ ఆమోదం
ఈ నెల 24వ తేదీ నందికొట్కూరులో జాబ్ మేళా
- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 21 :
సింగిల్ డెస్క్ విధానంలో అర్జీదారులు సమర్పించిన పరిశ్రమల అనుమతి దరఖాస్తులను నిర్ణీత గడువులోపే పరిష్కరించి, నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ ఎస్. మహబూబ్ బాషా, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ రెడ్డి, ఎల్‌డీఎం రవీంద్ర కుమార్, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం మొత్తం 1470 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానం ద్వారా 1465 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పది దరఖాస్తుల విషయంలో అవసరమైన పత్రాలను అర్జీదారుల నుంచే సేకరించి, దరఖాస్తులను తిరిగి పంపకుండా పర్యావరణ పరిరక్షణ, ఫ్యాక్టరీలు తదితర శాఖలు గడువులోపే అనుమతి ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్ చార్జీలపై సబ్సిడీ, సేల్స్ ట్యాక్స్ రాయితీలు వంటి ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలోని 10 పరిశ్రమల యూనిట్లకు రూ.113.90 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాలను కమిటీ ఆమోదించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
యువత నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఈనెల 24వ తేదీ నందికొట్కూరు పట్టణంలోని బసిరెడ్డి డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 20 ప్రముఖ కంపెనీలు హాజరవుతున్నాయని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో నిర్ణీత లక్ష్యాలను మించి జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, యువతి-యువకుల ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
