

నంద్యాల జిల్లా / డిసెంబర్ 30 – 2025 / సత్యం వార్త ప్రతినిధి :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపట్టిన రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఆమె సమగ్రంగా సమీక్షించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశారు.
ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాధ్, తాసిల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్ కలెక్టర్ వెంట వున్నారు.
అలాగే రాజకీయ పార్టీల తరపున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సయ్యద్ రియాజ్ భాష, టిడిపి నుంచి శివరామిరెడ్డి, వైయస్సార్సీపి నుంచి సాయిరాం రెడ్డి, బిజెపి నుంచి కే చంద్రశేఖర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్, సిపిఐ నుంచి నరసింహులు తదితర పార్టీ ప్రతినిధులు హాజరై పర్యవేక్షణలో పాల్గొన్నారు.
