ఇళ్ల నిర్మాణాలను గడువులోపల పూర్తి చేయాలి

నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచండి

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 29 :
జిల్లాలో నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాల పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, డీఎల్‌డివోలు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉగాది నాటికి 10,178 ఇళ్లు పూర్తి చేయాలని నిర్దేశించిన లక్ష్యంలో భాగంగా వారపు లక్ష్యాలు కూడా నిర్దేశించుకుని పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బేస్‌మెంట్ లెవల్ లో ఉన్న 6,905 లెంటల్ లెవల్ లో ఉన్న 2,794, రూఫ్ లెవల్‌లో ఉన్న 479 ఇళ్లన్నీ ఉగాది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద మంజూరైన 2,348 ఇళ్లలో 409 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని మిగిలిన 1,939 ఇళ్లను కూడా ఫిబ్రవరి 5 నాటికి వంద శాతం గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చెంచు కాలనీల్లో నిర్మించే పీఎమ్ జన్మన్ కింద మంజూరైన 556 గృహాలలో 282 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని మిగిలిన 334 ఇళ్లను కూడా గ్రౌండింగ్ చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి మంజూరైన 26,609 యూనిట్లలో 12,394 పూర్తి అయ్యాయని బేస్మెంట్ స్థాయిలో ఉన్న 3,312 వ్యక్తిగత మరుగుదొడ్లతోపాటు పెండింగ్ లో ఉన్న టాయిలెట్లను కూడా గ్రౌండింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (ఆల్ ప్లస్) కార్యక్రమానికి సంబంధించి పెండింగ్లో ఉన్న డేటాను తక్షణమే పూర్తి చేయాలన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న అంశాన్ని ప్రతి అధికారి దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Scroll to Top