
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 02 :
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్‌కు సంబంధించిన గోడను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు జేసీబీలతో కూల్చివేయడంతో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న ఏవీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా గోడను ఎలా కూల్చారని అధికారులను ప్రశ్నించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమని, రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలకు తావులేదన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏవీ సుబ్బారెడ్డి, పార్టీ పెద్దలతో మాట్లాడి ఆమె చిట్టాను బయట పెడతానని హెచ్చరించారు. రేపటి నుంచి ఏవీ సుబ్బారెడ్డి అంటే ఏమిటో చూపిస్తానంటూ అఖిలప్రియకు కఠిన వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, పోలీసులు భారీగా మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు.
https://satyamvaarthatelugudaily.com
